![]()
గుండాల, మన భద్రాద్రి న్యూస్, ఆగస్టు 19:
గుండాల మండల పరిధిలోని ముత్తాపురం గ్రామంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో నెలకొన్న సమస్యలపై ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. మంగళవారం రాత్రి నుంచి కొనసాగుతున్న దీక్షకు ముత్తాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ కల్తీ రాధా, మామకన్ను సర్పంచ్ కల్తీ రజితలు మద్దతు తెలిపారు. అనంతరం జేఏసీ చైర్మన్ చుంచ రామకృష్ణకు పూలమాల వేసి దీక్షకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ చుంచ రామకృష్ణ మాట్లాడుతూ.. ఏకలవ్య పాఠశాలలో ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా తీజ్ పండుగ నిర్వహించిన ఉపాధ్యాయులపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ సంఘాల నాయకులపై అసత్య ప్రచారాలు, బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. పాఠశాలలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంతో పాటు జాతి వివక్ష ఆరోపణలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. ధర్నా శిబిరాన్ని ఆర్సీఓ అరుణ సందర్శించి ఆందోళనకారులతో మాట్లాడారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొంతమంది విద్యార్థులు మెస్ మేనేజ్మెంట్కు సంబంధించిన ఉపాధ్యాయుడు రమేష్‌పై తమకు జాతి వివక్ష చూపుతున్నారని ఫిర్యాదు చేసినట్లు నాయకులు తెలిపారు. అనంతరం ఆదివాసీ సంఘాల నాయకులు ఆర్సీఓకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. డిమాండ్లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆర్సీఓ అరుణ తెలిపారు. సస్పెండ్ చేసే అధికారం తమ పరిధిలో లేదని, ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు వాగబోయిన చంద్రయ్య దొర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొడెం వెంకటేశ్వర్లు, పినపాక జేఏసీ మండల అధ్యక్షులు వెంకట్, పెండకట్ల నాగరాజు, తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు అలెం కోటి, మోకాళ్ళ వీరస్వామి, సందీప్ తదితరులు పాల్గొన్నారు.







