![]()
తెలుగు భాషపై ఐటీడీఏ పీవో ప్రత్యేక దృష్టి
– పలు అంశాల్లో పోటీలు.. ఉత్సాహంగా పాల్గొన్న గిరిజన విద్యార్థులు
భద్రాచలం, మన భద్రాద్రి న్యూస్
తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన భవన్లో వివిధ పోటీలు నిర్వహించారు. తెలుగు కవితలు, శీర్షికలు, పద్యాలు, ఒక నిమిషం పాటు తెలుగులో మాట్లాడటం, ఏకపాత్రాభినయం, క్విజ్ తదితర పోటీల్లో బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో బి. రాహుల్ మాట్లాడుతూ, తెలుగు భాషపై పట్టు కోసం వివిధ పోటీలు నిర్వహించడం ద్వారా పిల్లల్లో సృజనాత్మక శక్తి పెంపొందుతుందని, మాతృభాషపై మరింత విజ్ఞానం కలుగుతుందని తెలిపారు. ‘‘దేశభాషలందు తెలుగు లెస్స’’ అన్న తెలుగు కవుల మాటలు అక్షర సత్యమని అన్నారు. ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి వెలుగులోకి వస్తుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో కాలోజి నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఏకపాత్రాభినయాలు, కవితలు, నాటికలు, ఒక నిమిషం ఉపన్యాసాల్లో విజేతలైన విద్యార్థినీ విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, కవులకు సంబంధించిన చరిత్ర పుస్తకాలను బహుమతులుగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి ఫిరంగి, భద్రాచలం డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అధికారిణి చందన, గురుకులం ఆర్సీఓ అరుణకుమారి, ఏసీఎంఓలు రమేష్, రాములు, ఏటీడీవోలు చంద్రమోహన్, రాధమ్మ, భారతీదేవి, స్పోర్ట్స్ అధికారి గోపాలరావు, పీఎంఆర్సీ డీడీ ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.








