![]()
విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగించాలి
– దమ్మపేటలో విద్యుత్ ఉపకేంద్రాలను పరిశీలించిన సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి
– వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని అధికారులకు ఆదేశం
టీజీఎన్పీడీసీఎల్ (తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ) చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి, ఐఏఎస్ సోమవారం దమ్మపేట మండలంలోని గండుగులపల్లిలో ఎస్‌ఆర్‌ఎల్‌ఐపీ పంప్‌హౌస్ కోసం నిర్మించనున్న నూతన 132 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని, అలాగే అంకంపాలెం విద్యుత్ ఉపకేంద్రాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఉపకేంద్రాల పరిధిలోని విద్యుత్ వినియోగదారులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పామాయిల్ తోటల గుండా వెళ్లే విద్యుత్ లైన్లను భూగర్భ కేబుళ్లుగా మార్చాలని రైతులు వినతిపత్రం అందజేశారు.
అనంతరం విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందితో సమావేశమై విద్యుత్ సరఫరా, నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. విధి నిర్వహణలో భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందేలా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
ఈ పర్యటనలో కొత్తగూడెం సూపరింటెండింగ్ ఇంజనీర్ మహేందర్, డివిజనల్ ఇంజనీర్లు నందయ్య, వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట ఉపవిభాగ సహాయ డివిజనల్ ఇంజనీర్, సహాయ ఇంజనీర్లు, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.








