![]()
*ప్రజావాణిలో వెలవెలబోయిన సమావేశ మందిరం
*అర్జీల కోసం ఎదురుచూపులు.. ప్రజావాణికి కరువైన స్పందన
*ప్రజా సమస్యలు ఎన్నో.. ప్రజావాణికి వచ్చిన అర్జీలు ఐదే
ఆళ్లపల్లి, ఆగస్టు : 24 ( మన భద్రాద్రి న్యూస్ )
ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన కరువవుతోంది. సమస్యలు అనేకం ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించేందుకు అధికారులను ఆశ్రయించేందుకు ప్రజలు ముందుకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. సోమవారం మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం అర్జీదారులు లేక వెలవెలబోయింది. వివిధ శాఖలకు చెందిన అధికారులు హాజరైనప్పటికీ, మొత్తం కేవలం ఐదు దరఖాస్తులు మాత్రమే అందాయి. వీటిలో నాలుగు ఇందిరమ్మ ఇళ్లు, గృహ నిర్మాణానికి సంబంధించినవి కాగా, రెవెన్యూ భూ సమస్యపై ఒక్క దరఖాస్తు మాత్రమే నమోదైంది. అధికారులకు.. ప్రజలకు మధ్య పెరుగుతున్న దూరం ప్రజా సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజావాణి ఏర్పాటు చేసినప్పటికీ, కార్యక్రమానికి ప్రజలు పెద్దగా హాజరు కాకపోవడం అధికార యంత్రాంగంపై ప్రజల్లో నమ్మకం తగ్గుతోందన్న అభిప్రాయాలకు తావిస్తోంది. గతంలో వివిధ శాఖల కార్యాలయాల్లో సమర్పించిన వినతుల్లో అనేకం పరిష్కారం కాకపోవడంతో పాటు, తమ దరఖాస్తుల పరిస్థితి ఏమిటో కూడా అధికారులు తెలియజేయడం లేదని పలువురు బాధితులు పేర్కొంటున్నారు. పరిష్కారానికి గడువు లేకపోవడంతోనే.. ప్రజావాణిలో అర్జీ ఇచ్చిన తర్వాత సమస్య ఎప్పటిలోగా పరిష్కారమవుతుందనే స్పష్టత లేకపోవడం కూడా ప్రజల నిరాసక్తతకు కారణమవుతోందని స్థానికులు అంటున్నారు. దరఖాస్తులపై నిర్ణీత గడువు విధించి, పరిష్కారం లేదా తిరస్కరణకు గల కారణాలను అర్జీదారులకు తెలియజేస్తే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని వారు చెబుతున్నారు. క్షేత్రస్థాయికి వెళ్లాలని డిమాండ్
గ్రామాల్లో సమస్యలు ఎదురైనప్పుడు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. ప్రజావాణి కేవలం అధికారులు హాజరై వెళ్లిపోయే కార్యక్రమంగా కాకుండా, అందిన ప్రతి వినతిపై చర్యలు తీసుకునే వేదికగా మారాలని వారు అభిప్రాయపడుతున్నారు. తక్కువ సంఖ్యలో వచ్చిన అర్జీలనైనా సంబంధిత అధికారులు స్వయంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరిస్తే ప్రజల్లో కార్యక్రమంపై నమ్మకం పెరుగుతుందని పేర్కొంటున్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ జి. ఉమారాణి, ఎంపీడీవో ధీరావత్ శ్రీను, వ్యవసాయ అధికారి కె.ఎస్. కుమార్ రాజా, ఎస్ఐ ఎం. సోమేశ్వర్ తో పాటు వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.








