![]()
- గ్రామ సభలో ప్రజల డిమాండ్
- రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తాం: తహసీల్దార్
గుండాల, మన భద్రాద్రి న్యూస్, జూన్ 10:
నిరుపేదలకు గృహ వసతి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం గుండాల మండలంలో ఇసుక కొరత కారణంగా నిలిచిపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం గుండాల గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కోరం సీతారాములు అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో ప్రజలు అధికారులను నిలదీశారు. మండల వ్యాప్తంగా రెండు నెలలుగా ఇసుక కొరత కారణంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు నిలిచిపోయాయని, పోలీసు, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో ఇసుక రవాణా జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుక కొరత లేకుండా ఉన్నతాధికారులతో చర్చించి రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం 99 రోజుల ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా వివిధ అంశాలపై చర్చించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను గ్రామస్తులు గ్రామసభ దృష్టికి తీసుకువచ్చారు. ఇండ్ల మధ్యుగా వెళ్తున్న విద్యుత్ లైన్లను తొలగించాలని, పంట పొలాలకు ఉపాధి హామీ పథకం ద్వారా రహదారి సౌకర్యం కల్పించాలని కోరారు. ఇతర సమస్యలపై కూడా గ్రామసభలో చర్చించి తీర్మానాలు చేశారు. రోడ్డు భద్రతపై పోలీసు అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ చైతన్యవంతులుగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ తిరుపతి, ఎస్సై శ్రావణ్ కుమార్, తహసీల్దార్ సంగీత, ఎంపీడీఓ బాలరాజు, వ్యవసాయ అధికారి వెంకటరమణ, వైద్యాధికారి సుదీప్, అటవీ శాఖ అధికారి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, వివిధ శాఖల అధికారులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.







