![]()
- వీధి దీపాల ఏర్పాటు కోసం ప్రజల విజ్ఞప్తి
- చీకటితో ప్రజలు భయాందోళన.. విషసర్పాల సంచారం, షార్ట్ సర్క్యూట్లతో ఇబ్బందులు
సారపాక, మన భద్రాద్రి న్యూస్
సారపాక మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సుందరయ్య నగర్లో విద్యుత్ స్తంభాల కొరత తీవ్రంగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం నుంచి మళ్లీ కృష్ణ ఇంటి వరకు కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను, గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని కోరుతున్నారు.
ఇటీవల గోదావరి నది నీటిమట్టం 56 అడుగులకు చేరుకుని వరదలు రావడంతో సమీపంలోని జామాయిల్ తోటలు, వ్యవసాయ పొలాల నుంచి విషసర్పాలు, ఇతర కీటకాలు కాలనీలోని ఇళ్లలోకి వస్తున్నాయని స్థానికులు తెలిపారు. రాత్రి వేళల్లో వీధి దీపాలు లేక తీవ్ర చీకటి నెలకొనడంతో రహదారులపై సంచరించే విషసర్పాలు కనిపించక ప్రజలు భయాందోళనల మధ్య రాకపోకలు సాగిస్తున్నారని వాపోయారు.
కాలనీలో విద్యుత్ స్తంభాలు తక్కువగా ఉండటంతో ఒక్కో స్తంభంపై సుమారు 20 విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాల్సి వస్తోందని, దీంతో తరచూ షార్ట్సర్క్యూట్లు జరిగి గృహోపకరణాలు దెబ్బతింటున్నాయని స్థానికులు పేర్కొన్నారు.
మరోసారి గోదావరి వరదలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని వెంటనే కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి, వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలని సారపాక మేజర్ గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, విద్యుత్ శాఖ అధికారులను సుందరయ్య నగర్ ప్రజలు విజ్ఞప్తి చేశారు.








