![]()
భద్రాచలం–వాజేడు రహదారికి మోక్షం కల్పించాలి
- వారం రోజుల్లో పనులు ప్రారంభం కాకపోతే కాంట్రాక్టర్‌ను మార్చాలని ఏపీ ఆర్అండ్బీ మంత్రిని కోరిన మంత్రి తుమ్మల
భద్రాచలం, మన భద్రాద్రి న్యూస్
భద్రాచలం నుంచి వాజేడు వరకు అధ్వాన్నంగా మారిన రహదారికి తక్షణమే మోక్షం కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రోడ్లు–భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డిని కోరారు. బుధవారం ఈ మార్గంలో ప్రయాణించిన సందర్భంగా రహదారి దుస్థితిని గమనించిన మంత్రి తుమ్మల వద్దకు స్థానికులు వెళ్లి తమ సమస్యలను వివరించారు.
గతంలో ఈ రహదారి నిర్మాణం జరిగినప్పటి నుంచి ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదని, కేవలం 100 కిలోమీటర్ల ప్రయాణానికే మూడు గంటల సమయం పడుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి దుస్థితి వల్ల నిత్యం ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
ప్రజల సమస్యలను విన్న వెంటనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ఆర్అండ్బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, సంబంధిత అధికారులు, తెలంగాణ ఆర్అండ్బీ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. రహదారి మరమ్మతులు, అభివృద్ధి పనులను అత్యవసరంగా ప్రారంభించి ప్రజల కష్టాలకు ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు. వారం రోజుల్లో పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటానని స్థానికులకు హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, రహదారి అభివృద్ధి పనులకు ఇప్పటికే పరిపాలనా అనుమతులు లభించినప్పటికీ కాంట్రాక్టర్ ఇప్పటివరకు పనులు ప్రారంభించకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. వారం రోజుల్లో పనులు ప్రారంభం కాకపోతే ప్రస్తుత కాంట్రాక్టర్‌ను తొలగించి కొత్త టెండర్లు పిలిచి పనులను వేగవంతం చేయాలని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డిని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
భద్రాచలం–వాజేడు రహదారి అభివృద్ధి పనులను మూడు ప్యాకేజీలుగా చేపట్టనున్నారు. భద్రాచలం నుంచి ఏటపాక వరకు 7.8 కిలోమీటర్ల రహదారిని రూ.3.70 కోట్లతో, ఏటపాక నుంచి సుబ్బంపేట వరకు 56.8 కిలోమీటర్ల రహదారిని రూ.67.58 కోట్లతో, సుబ్బంపేట నుంచి వాజేడు వరకు 48 కిలోమీటర్ల రహదారిని రూ.44 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. మొత్తం 112.6 కిలోమీటర్ల రహదారిని సుమారు రూ.115.28 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు.
ఈ పనులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రోడ్లు–భవనాల శాఖల ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి వచ్చే లక్షలాది మంది భక్తులు ఈ రహదారిపై ప్రయాణించే నేపథ్యంలో పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు.








