![]()
సర్పంచ్ గారు…ఇలా ఉంటే రావా మాకు రోగాలు
చర్ల పంచాయతీ కార్యాలయం ముందే మురుగునీటి గుంటలు!
కంటి ముందు సమస్య కనబడుతున్నా పట్టించుకోని పాలకవర్గం
చర్ల,మన భద్రాద్రి న్యూస్,అక్టోబర్ 12 :
చర్ల గ్రామ పంచాయతీ పాలకవర్గం చెప్పుకుంటున్న పంచాయతీ సమస్యల పరిష్కారం కేవలం మాటలకే పరిమితమని తేటతెల్లమైంది.పంచాయతీ కార్యాలయానికి కూతవేటు దూరంలో,తహసీల్దార్ కార్యాలయం నుండి లింగాపురం పాడు వెళ్లే ప్రధాన రహదారి పక్కనే డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా పూడుకుపోయి మురుగునీటి చెరువును తలపిస్తున్నా,పాలకవర్గం, అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నరని స్థానికులు విమర్శిస్తున్నారు.తమ పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని,ఎక్కడా ఎటువంటి సమస్యలు లేకుండా పరిష్కరిస్తున్నామని చెప్పుకుంటున్న పాలకవర్గానికి, కార్యాలయం ముందే ఉన్న డ్రైనేజీ కనబడకపోవడం ఆశ్చర్యకరం.కంటి ముందే ఇంత మురుగునీరు నిలిచి,దుర్గంధం వెదజల్లుతున్నా నాయకులు కానీ పంచాయతీ అధికారులు కానీ పట్టించుకోకపోవడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.ఈ డ్రైనేజీ సమస్య ఈనాటిది కాదని,ప్రతి సంవత్సరం వర్షాకాలం, చలికాలం అనే తేడా లేకుండా ఇదే పరిస్థితి దాపురిస్తోందని అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.డ్రైనేజీలో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు,పిచ్చి మొక్కలు పెరిగిపోయి నీరు వెళ్లకుండా నిలిచిపోయింది.దీంతో దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక రోగాల బారిన పడే ప్రమాదం ఉందని స్థానికులు భయపడుతున్నారు.పంచాయతీ కార్యాలయం ముందున్న డ్రైనేజీనే శుభ్రం చేయలేని వారు, గ్రామ సమస్యలను ఎలా పరిష్కరించగలరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.పాలకవర్గం పంచాయతీ అధికారుల పనితీరుకు ఈ మురుగునీటి గుంటలే నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని,డ్రైనేజీకి శాశ్వత పరిష్కారం చూపాలని,రోగాల బారి నుండి తమను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.








