![]()
సింగరేణి అధికారుల దీక్షకు టీయూసీఐ మద్దతు
13వ రోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపిన టీయూసీఐ నాయకులు
ఇల్లందు, మన భద్రాద్రి న్యూస్, జూలై 11:
కోల్ మైన్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ సమస్యల పరిష్కారం కోసం గత 13 రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) నాయకులు శనివారం ఇల్లందు జీఎం కార్యాలయం వద్ద ఉన్న దీక్షా శిబిరంలో పాల్గొని సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో టీయూసీఐ జిల్లా కార్యదర్శి షేక్ యాకుబ్ షావలి, నాయకులు రామ్ సింగ్, పాయం వెంకన్న మాట్లాడుతూ, సింగరేణి అధికారులను నిరసన కార్యక్రమాలకు దిగే పరిస్థితి రావడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ఉత్పత్తి, భద్రత వంటి కీలక అంశాలపై దృష్టి సారించాల్సిన అధికారులను సమస్యలతో ఆందోళనకు దిగేలా చేయడం విచారకరమన్నారు.
సింగరేణి అభివృద్ధి విషయంలో గత, ప్రస్తుత ప్రభుత్వాలు సరైన విధానాలు అనుసరించలేదని ఆరోపించారు. బొగ్గు గనుల నిర్వహణ, సింగరేణి భవిష్యత్తు, కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వాలు స్పష్టమైన వైఖరి అవలంబించాలని కోరారు. అధికారుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు టీయూసీఐ పూర్తి మద్దతు కొనసాగిస్తుందని ప్రకటించారు.
అనంతరం దీక్షలో పాల్గొన్న అధికారులకు నిమ్మరసం అందించి రిలే నిరాహార దీక్షను విరమింపజేశారు.
ఈ కార్యక్రమంలో సింగరేణి వివిధ విభాగాల అధికారులు, టీయూసీఐ జిల్లా నాయకులు వేముల గురునాథం, ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు భూక్య రాజేష్, మహేష్, గుమ్మడి శివ, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.








