![]()
విద్యుత్ బాధిత కుటుంబాలకు రూ.20 లక్షల ఆర్థిక సాయం
ఎస్టీ కమిటీ చైర్మన్‌గా నియమితులైన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు విద్యుత్ శాఖ అధికారుల అభినందనలు
మణుగూరు, మన భద్రాద్రి న్యూస్, జూలై 8:
తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) సంక్షేమ కమిటీ చైర్మన్‌గా నియమితులైన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్, సబ్ ఇంజినీర్లు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఇటీవల విద్యుత్ ప్రమాదాల్లో మృతి చెందిన జనంపేట కొత్తూరు కాలనీకి చెందిన బిజ్జా రాజిత కుటుంబానికి, కరకగూడెం మండలం భట్టుపల్లికి చెందిన బిలపాటి నరేందర్ కుటుంబానికి, మణుగూరు మండలం కాలీమాత ఏరియాకు చెందిన తిగుళ్ల ఉపేందర్ కుటుంబానికి, శివలింగాపురానికి చెందిన బేతం రత్నం కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.20 లక్షల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం ఆపరేషన్ డివిజన్ డీఈ కె. జీవన్ కుమార్, మణుగూరు ఆపరేషన్ ఏడీఈ డి. ఉమా మహేశ్వరరావు, సబ్ ఇంజినీర్లు వై. శివకుమార్, ఎం. లారెన్స్, ఎస్ఎల్ఐ జి. సర్వేశ్వరరావు, ఎల్ఐ ఎం. మధుసూదన్‌రావు తదితరులు పాల్గొన్నారు.








