![]()
భద్రగిరి మార్ట్‌లో ఆర్గానిక్ అటవీ ఉత్పత్తులు ఆకట్టుకుంటున్నాయి
– గిరిజన మహిళలకు ఆర్థిక బలాన్నిచ్చే వినూత్న వేదికగా భద్రగిరి మార్ట్
– ట్రీ ఫెడ్ అదనపు సంచాలకులు సయ్యద్ ఆరిఫ్ వలి
భద్రాచలం, జూలై 9 (మన భద్రాద్రి న్యూస్)
భద్రాచలం పట్టణ ప్రజలకు అడవుల్లో లభించే అటవీ ఉత్పత్తులు, సేంద్రియ (ఆర్గానిక్) ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలు, గిరిజన రైతులకు ఆర్థికంగా చేయూత అందించాలనే దూరదృష్టితో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ కృషితో ఏర్పాటు చేసిన భద్రగిరి మార్ట్ ఎంతో అద్భుతంగా ఉందని ట్రీఫెడ్ (కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ) అదనపు సంచాలకులు సయ్యద్ ఆరిఫ్ వలి ప్రశంసించారు.
గురువారం భద్రాచలం పట్టణంలోని భద్రగిరి మార్ట్‌ను ట్రీఫెడ్ ప్రతినిధులతో కలిసి సందర్శించిన ఆయన, మార్ట్‌లో అందుబాటులో ఉన్న అటవీ ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలకు ఉపయోగపడే అనేక అటవీ ఉత్పత్తులను ఒకేచోట అందుబాటులో ఉంచడం అభినందనీయమన్నారు.
స్వయం సహాయక సంఘాల మహిళలు, ఆర్గానిక్ పంటలు పండించే గిరిజన రైతుల ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించడంతో పాటు గిరిజన కుటుంబాలకు ఆర్థిక బలం చేకూర్చే లక్ష్యంతో ఈ మార్ట్‌ను ఏర్పాటు చేయడం విశేషమన్నారు. భద్రగిరి మార్ట్‌కు సంబంధించిన వివరాలను న్యూఢిల్లీలోని తమ కార్యాలయానికి నివేదిక రూపంలో పంపిస్తామని తెలిపారు. మార్ట్‌లోని ఉత్పత్తుల నాణ్యత, ధరలు, వినియోగదారులకు అందుతున్న సేవలను కూడా పరిశీలించినట్లు పేర్కొన్నారు.
భద్రగిరి మార్ట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఐటీడీఏ అధికారులు.. స్టాక్ నిర్వహణ, నాణ్యతపై సిబ్బందికి కీలక సూచనలు
ఈ సందర్భంగా ఐటీడీఏ అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి (జనరల్) డేవిడ్ రాజ్ భద్రగిరి మార్ట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, నిత్యావసర సరుకుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, అమ్మకాల వివరాలను పరిశీలించారు.
మార్ట్‌లో డిమాండ్‌కు అనుగుణంగా సరుకులను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని, స్టాక్ రిజిస్టర్లను తప్పులులేకుండా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. అలాగే సరఫరాదారులకు చెల్లింపులు సకాలంలో చేయాలని, వినియోగదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా నాణ్యతను కాపాడాలని ఆదేశించారు.
అనంతరం భద్రాచలం పట్టణంలోని మిక్కీ పచ్చళ్ల తయారీ కేంద్రాన్ని సందర్శించిన అధికారులు, తయారీ విధానాన్ని, ముడి సరుకుల నాణ్యతను పరిశీలించారు. ఎలాంటి కల్తీ లేకుండా నాణ్యమైన పచ్చళ్లను తయారు చేసి భద్రగిరి మార్ట్‌కు సరఫరా చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు నేహా శర్మ, మన్సిమ్రాన్ కౌర్, ఐటీడీఏ మేనేజర్ ఆదినారాయణతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.








