![]()
తేదీ: 13-06-2026 అంబేద్కర్ సెంటర్, డీవీ ఫంక్షన్ హాల్, మణుగూరు మండలం మన భద్రాద్రి న్యూస్
మణుగూరు మండలం అంబేద్కర్ సెంటర్లోని డీవీ ఫంక్షన్ హాల్లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) శిక్షణా శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ షబ్బీర్ అలీ, డీసీసీ జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ముఖ్య అతిథులుగా హాజరై బీఎల్ఏలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ విజయానికి బూత్ స్థాయిలో బీఎల్ఏల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ప్రతి బీఎల్ఏ ఒక సైనికుడిలా పనిచేస్తూ ప్రజల్లో పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. దొంగ ఓట్లు, అక్రమాలు, ప్రలోభాలకు తావులేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. డీసీసీ జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న మాట్లాడుతూ, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి పేర్ల తొలగింపు, చిరునామా మార్పులు వంటి అంశాలను ఫారం-6, 7, 8 ద్వారా సకాలంలో పూర్తి చేయాలని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, బూత్ లెవల్ ఏజెంట్లు కేవలం ఓటరు జాబితా పనులకే పరిమితం కాకుండా పార్టీకి, ప్రజలకు మధ్య వారధిలా పనిచేయాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రతి బూత్‌లో పార్టీని బలోపేతం చేయడం ద్వారానే ఎన్నికల్లో విజయం సాధించవచ్చని పేర్కొన్న ఎమ్మెల్యే, కొత్త ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. బీఎల్ఓలు, బీఎల్ఏలు సమన్వయంతో పనిచేస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించాలని, ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించడంలో తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. పార్టీ బలం క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలతోనే పెరుగుతుందని పేర్కొంటూ, ప్రతి బీఎల్ఏ కాంగ్రెస్ పార్టీ విజయానికి సైనికుడిలా పనిచేయాలని, రాబోయే ఎన్నికల్లో ప్రతి బూత్‌లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ వచ్చేలా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్, మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, మండల అధ్యక్షులు, జిల్లా ముఖ్య నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, బీఎల్ఏలు, బీఎల్ఓలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








