![]()
పూరి గుడిసెల్లో నివసించే ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేరుస్తాం
– ప్రతి మారుమూల గ్రామానికి బీటీ రోడ్ల నిర్మాణం చేపడతాం
– ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం, బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
బూర్గంపాడు, మన భద్రాద్రి న్యూస్, జులై 19
పూరి గుడిసెల్లో నివసిస్తున్న ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తోందని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ఆదివారం బూర్గంపాడు మండలంలోని మొరంపల్లి బంజర గ్రామంలో ఆవుల రమణ దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని గృహాన్ని ప్రారంభించారు. అనంతరం పినపాక పట్టినగర్ గ్రామం నుంచి ఉప్పుసాక వెళ్లే మార్గంలో రూ.2.20 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీవో బి. రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పినపాక నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులను ప్రభుత్వం సమకూరుస్తోందన్నారు. రాష్ట్రంలో పూరి గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలందరికీ, అన్ని వర్గాలకు దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి సొంతింటి కలను నెరవేర్చుతామని తెలిపారు. అలాగే రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రెండు పంటలకు రైతు భరోసా అందిస్తున్నామని చెప్పారు.
పినపాక నియోజకవర్గానికి తొలి విడతలో 4,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, రెండో విడతలో మరో 2,000 ఇళ్ల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. బూర్గంపాడు మండలానికి మంజూరైన 675 ఇళ్లలో ఇప్పటికే 325 ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు.
రైతులకు సాగునీరు అందించేందుకు సీతారామ కాలువల ద్వారా దోమలవాగు చెరువుకు నీటిని విడుదల చేసి రెండు పంటలు సాగు చేసుకునేలా చర్యలు తీసుకున్నామని, దోమలవాగు చెరువును మినీ రిజర్వాయర్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో విద్యా చందన, ఎంపీడీవో జమాల్ రెడ్డి, హౌసింగ్ పీడీ శంకర్, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.








