![]()
కనీస వేతనాల అమలుకు ఐటీసీ యాజమాన్యానికి వినతిపత్రం
– ప్రభుత్వ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని డిమాండ్
భద్రాచలం, మన భద్రాద్రి న్యూస్, జూలై 13
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన కొత్త కనీస వేతనాలను బదిలీ, కాంట్రాక్ట్ కార్మికులకు వెంటనే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల బోర్డు సభ్యుడు యారం పిచ్చిరెడ్డి, ఐఎన్టీయూసీ మిత్రపక్షాల ఉపాధ్యక్షుడు గంజి వీరభద్రరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు భద్రాచలంలోని ఐటీసీ యాజమాన్య మానవ వనరుల విభాగానికి సోమవారం వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం మే 30, 2026న కొత్త కనీస వేతనాలపై ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి, జూన్ 1, 2026 నుంచి అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. ఈ ఉత్తర్వుల ప్రకారం అన్ని అర్హత కలిగిన బదిలీ, కాంట్రాక్ట్ కార్మికులకు కొత్త వేతనాలు చెల్లించడం ప్రతి యాజమాన్యం చట్టబద్ధమైన బాధ్యత అని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉత్తర్వులు అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చెల్లించాల్సిన వేతన బకాయిలను ఎలాంటి కోతలు లేకుండా వెంటనే కార్మికులకు చెల్లించాలని కోరారు. అలాగే ప్రభుత్వం భవిష్యత్తులో ప్రకటించే కరవు భత్యం, ఇతర చట్టబద్ధమైన వేతన సవరణలను కూడా నిర్ణయించిన తేదీ నుంచే అమలు చేయాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.
పాత కనీస వేతనాల ఉత్తర్వులు రద్దు కావడంతో ప్రస్తుతం అమల్లో ఉన్న కొత్త వేతనాలను ఐటీసీ భద్రాచలం యూనిట్లో పనిచేస్తున్న బదిలీ, కాంట్రాక్ట్ కార్మికులందరికీ వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆలస్యం చేయకుండా అమలు చేయడం ద్వారా కార్మికులకు న్యాయం చేయాలని అన్నారు.
ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే కార్మిక సంఘాలతో చర్చించి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ మిత్రపక్షాల కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, కార్మిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








