![]()
ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి
- బీఎల్వోలు, బీఎల్ఏలకు ఏఈఆర్ఓ రవికుమార్ సూచన
భద్రాచలం (మన భద్రాద్రి న్యూస్)
పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని భద్రాచలం నియోజకవర్గ ఏఈఆర్ఓ, తహసీల్దార్ కోట రవికుమార్ బీఎల్వోలు, బీఎల్ఏలకు సూచించారు.
బుధవారం భద్రాచలం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే నిర్వహించి ఓటరు మ్యాపింగ్ పూర్తి చేయాలని తెలిపారు. ఓటరు జాబితాలో ఉన్న వ్యక్తులు వలస వెళ్లారా, మరణించారా, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు ఉన్నాయా అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.
ఎస్ఐఆర్ సర్వే ఆధారంగానే తుది ఓటరు జాబితా రూపొందించబడనున్నందున ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్ర పరిధిలో ఒక్క అర్హ ఓటరు కూడా మిగిలిపోకుండా చూడాలని, ప్రజాప్రతినిధులు, ప్రముఖుల ఓటరు వివరాల ధృవీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ఓటీపీ వంటి వ్యక్తిగత వివరాలను ఇతరులకు వెల్లడించరాదని, అది చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.
ఎస్ఐఆర్ షెడ్యూల్ ప్రకారం జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయనుండగా, ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు స్వీకరించి, అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రచురించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్నికల డీటీ గోపాలకృష్ణ, సీనియర్ సహాయకులు రామయ్య, బీఎల్వో సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.








