![]()
ఇసుక కాంట్రాక్టుల్లో గిరిజనులకు అన్యాయం: తుడుం దెబ్బ
ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని అలెం కోటి డిమాండ్
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 12
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోదావరి పరివాహక ప్రాంతాల్లో కొనసాగుతున్న ఇసుక కాంట్రాక్టు పనుల్లో స్థానిక గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలెం కోటి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన త్యాగాల ఫలితాలు స్థానిక ప్రజలకు అందాల్సి ఉండగా, నీళ్లు, నిధులు, నియామకాల ప్రయోజనాలు ఇతర ప్రాంతాల వారికి మళ్లుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో అమలులో ఉన్న ఐదవ షెడ్యూల్, 1/70 చట్టం, పీసా చట్టం, అటవీ హక్కుల చట్టం వంటి రాజ్యాంగ, చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘిస్తూ సహజ వనరుల దోపిడీ జరుగుతోందని అలెం కోటి ఆరోపించారు. కొందరు ఆంధ్ర ప్రాంత కాంట్రాక్టర్లు స్థానిక గిరిజనుల భూములు, అడవులు, సహజ వనరులను దోచుకుంటుండగా, దీనికి కొంతమంది అధికారులు సహకరిస్తున్నారని విమర్శించారు.
కోట్ల రూపాయల విలువైన సహజ వనరుల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ అండదండలు ఉన్నాయంటూ కొందరు కాంట్రాక్టర్లు బహిరంగంగా వ్యాఖ్యానించడం గిరిజన సమాజానికే కాకుండా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్య అని పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, మేధావులు వెంటనే స్పందించి గిరిజనులకు న్యాయం చేయాలని కోరిన అలెం కోటి, లేనిపక్షంలో ఆదివాసి హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని ఆయన స్పష్టం చేశారు.








