![]()
ఆపరేషన్ ముస్కాన్పై అదనపు కలెక్టర్ సమీక్ష
– బాల కార్మికులు, బాల్య వివాహాల నిరోధానికి సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశం
కొత్తగూడెం, మన భద్రాద్రి న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ, పోలీసు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్–12 ప్రత్యేక కార్యక్రమంపై జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) విద్యా చందన సమీక్ష నిర్వహించారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా, వివిధ శాఖల అధికారులతో కలిసి కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. తొలి 15 రోజుల్లో ఎంత మంది బాల కార్మికులను గుర్తించి విముక్తి కల్పించారు, ఎన్ని కేసులు నమోదు చేశారు, ఎంత మంది బాలబాలికలను రక్షించారు అనే అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
బాల్య వివాహాలు, బాల కార్మికుల కేసులు వెలుగులోకి వచ్చిన వెంటనే కేసులు నమోదు చేసి, బాధిత బాలబాలికలకు కౌన్సెలింగ్ అందించి పునరావాసం కల్పించాలని సంబంధిత అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా మాట్లాడుతూ, ఆపరేషన్ ముస్కాన్–12 తొలి విడత నివేదికను అదనపు కలెక్టర్కు అందజేసినట్లు తెలిపారు. మిగిలిన 15 రోజులు కూడా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, రాష్ట్ర స్థాయిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించేలా కార్యాచరణ అమలు చేస్తున్నామని వెల్లడించారు.
ఈ సమావేశంలో బాలల సంక్షేమ కమిటీ సభ్యులు సబ్బాతి సుమిత్రాదేవి, మహమ్మద్ సాదిక్ పాషా, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి తూకారం రాథోడ్, జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి అరుణ, కార్మిక శాఖ అధికారి నాగరాజు, జిల్లా పంచాయతీ అధికారి నవీన్, జిల్లా బాలల సంరక్షణ అధికారి హరికుమారి, పోలీసు శాఖకు చెందిన షీ టీమ్స్ ఉప నిరీక్షకురాలు రమాదేవితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.








