![]()
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యానికి విఘాతం
- కాంగ్రెస్ లీగల్ సెల్ కన్వీనర్ భజన సతీష్ విమర్శ
బూర్గంపహాడ్, జూన్ 10 (మన భద్రాద్రి న్యూస్)
రాజ్యసభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, ఏఐసీసీ సభ్యురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ భజన సతీష్ విమర్శించారు. బూర్గంపహాడ్ ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. అఫిడవిట్లో కేసు ప్రస్తావన లేకపోవడాన్ని కారణంగా చూపి నామినేషన్ను తిరస్కరించారని, ఎన్నికల నిబంధనల ప్రకారం సవరణకు అవకాశం ఇవ్వాల్సి ఉండగా ఉద్దేశపూర్వకంగానే ఆ అవకాశం కల్పించలేదని అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని, ఆ ప్రజాదరణను దెబ్బతీసేందుకు రాజకీయ ప్రత్యర్థులు కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఆరు గ్యారెంటీలతో ప్రజల విశ్వాసాన్ని పొందుతోందని పేర్కొన్నారు.
గ్రామ సర్పంచ్ మంద నాగరాజు మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగాలని, చిన్నపాటి సాంకేతిక కారణాలతో నామినేషన్ తిరస్కరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఉప సర్పంచ్ గుండె వెంకన్న మాట్లాడుతూ, ప్రతి అభ్యర్థికి సమాన అవకాశాలు కల్పించాల్సిన సమయంలో సవరణకు అవకాశం ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోందని వ్యాఖ్యానించారు.
ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ న్యాయపరంగా పోరాటం కొనసాగిస్తుందని, ఇప్పటికే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టును ఆశ్రయించే చర్యలు చేపట్టినట్లు భజన సతీష్ తెలిపారు. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించేందుకు అన్ని రాజ్యాంగబద్ధ మార్గాల్లో పోరాడతామని స్పష్టం చేశారు.
ఈ విలేకరుల సమావేశంలో పినపాక నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎడమకంటి సుధాకర్ రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నిమ్మల హరీష్ యాదవ్, నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ దునుకు రాము, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ సింప్లీ సాయి తదితరులు పాల్గొన్నారు.








