![]()
అక్రమ క్వారీలపై చర్యలు తీసుకోవాలి: సేవాలాల్ సేన
మైనింగ్ అధికారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
పాల్వంచ, జూన్ 22 (మన భద్రాద్రి న్యూస్):
పాల్వంచ మండలం తోగూడెం గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సేవాలాల్ సేన మండల అధ్యక్షుడు ధర్మసోత్ పవన్ కళ్యాణ్ నాయక్ డిమాండ్ చేశారు.
ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదాయాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్న అధికారులు అక్రమ క్వారీల నిర్వహణపై తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు. తోగూడెం పరిధిలో పలు అక్రమ క్వారీలు కొనసాగుతున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు సమర్థవంతంగా స్పందించలేదని విమర్శించారు.
కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి కొన్ని క్వారీలపై చర్యలు తీసుకునే వరకు జిల్లా యంత్రాంగం స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని కోరారు.
అక్రమ మైనింగ్ కారణంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం నష్టపోతుందని, ప్రకృతి సంపద దెబ్బతింటోందని పేర్కొన్నారు. ఈ అంశంపై బాధ్యులైన అధికారుల పాత్రను పరిశీలించి అవసరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.
అక్రమ మైనింగ్ వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తు నిర్వహించి, బాధ్యులైన వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా సంపద, ప్రకృతి వనరుల పరిరక్షణ కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.
ఈ అంశంపై సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు పత్రం అందజేయనున్నట్లు తెలిపారు. సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్ ఆధ్వర్యంలో ఈ వినతిపత్రం సమర్పించనున్నట్లు పేర్కొన్నారు.








