![]()
జాతీయ రహదారిపైనే సంత నిర్వహణ
- ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతున్న వైనం
సారపాక, మన భద్రాద్రి న్యూస్, జూన్ 23
బూర్గంపహాడ్ మండలం, సారపాక పట్టణంలో ప్రతి వారం నిర్వహిస్తున్న సంత జాతీయ రహదారి (నేషనల్ హైవే)పైకి విస్తరించి ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంత వ్యాపారులు రహదారిలో ఎక్కువ భాగాన్ని ఆక్రమించి వ్యాపారం నిర్వహిస్తుండటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
ప్రతిరోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ జాతీయ రహదారిపై సంత కారణంగా తరచూ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు, అత్యవసర సేవల వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొంటున్నారు.

సంతకు వచ్చే ప్రజలు రహదారిపైనే సంచరించాల్సి రావడంతో ప్రమాదాల ముప్పు కూడా పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలుమార్లు ప్రమాదాలు తృటిలో తప్పిన ఘటనలు జరిగినప్పటికీ సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కాబట్టి జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ, జాతీయ రహదారి అధికారులు వెంటనే స్పందించి రహదారి ఆక్రమణలను తొలగించి సంతను అనువైన ప్రదేశంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రమాదాలు జరిగే ముందు అధికారులు స్పందించి ప్రజల ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.








